యాంకర్ ప్రదీప్ విషయంలో కోర్టు తీర్పు ఇదే! 

హైదరాబాద్: డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్‌ విషయంలో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ప్రదీప్‌కు రూ.2100 జరిమానా విధించింది. డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని తిరిగొస్తున్న సమయంలో జూబ్లీహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రదీప్ ఫూటుగా మద్యం సేవించి అడ్డంగా దొరికిపోయాడు. బ్రీత్ ఎనలైజర్‌లో 170కి పైగా పాయింట్లు నమోదు కావడంతో ప్రదీప్ కారును పోలీసులు సీజ్ చేశారు. ప్రదీప్ ఆ తర్వాత కొన్ని రోజులు అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత ఓ వీడియోను విడుదల చేసి కోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేశాడు. తండ్రితో కలిసి పోలీస్ కౌన్సెలింగ్‌కు కూడా ప్రదీప్ హాజరయ్యాడు. ఇవాళ కోర్టుకు కూడా తండ్రితో కలిసి వెళ్లాడు. మారిన ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ప్రదీప్‌కు జైలు శిక్ష పడుతుందని భావించినా.. ప్రదీప్‌కు కొంత ఊరట లభించింద ి.