జపాన్ పర్యటనలో కేటీఆర్ బిజీ

-12 కంపెనీల ప్రతినిధులతో సమావేశం
-పెట్టుబడుల కోసం విస్తృత చర్చలు
-వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు బుధవారం జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి యూజిమొటోతో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించి, జపాన్‌తో వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతంపై ఆయనతో చర్చించారు. బుధవారం జపాన్ పర్యటన తొలిరోజు మంత్రి కేటీఆర్.. విదేశీ పెట్టుబడులను తెలంగాణలోకి రప్పించే లక్ష్యంతో దాదాపు 12 కంపెనీల ఉన్నతస్థాయి ప్రతినిధులతో భేటీ అయ్యారు. దక్షిణ కొరియా నుంచి మంగళవారం జపాన్ చేరుకున్న మంత్రి కేటీఆర్ బృందం జపాన్ రాజధాని టోక్యోలో పలు కంపెనీలతో చర్చలు జరిపింది. తొలుత జపాన్‌లోని భారత రాయబారి సుజన్ చినోయ్‌తో భేటీ అయింది.

తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. జపాన్ సాధించిన సాంకేతిక ప్రగతి ముఖ్యంగా.. పరిశ్రమలు, వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో అనుసరిస్తున్న పద్ధతులను ఆదర్శంగా తీసుకుంటామని చెప్పారు. దీనితోపాటు జపాన్, తెలంగాణల మధ్య మరింత బలమైన ఆర్థిక, వ్యాపార భాగస్వామ్యాలను నెలకొల్పేందుకు సహకారమందించాలని రాయబారిని కోరారు. జపాన్ ఆర్థికసంస్థలు (జైకా వంటివి) తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు ఇప్పటికే రుణసహాయం అందించాయని, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఆ దిశగా రాష్ర్టానికి సహకారం అందించాలని రాయబారిని కోరారు.

టకుమా కంపెనీతో భాగస్వామ్య కోసం..
మంత్రి కేటీఆర్ బృందం బుధవారం12 కంపెనీల ఉన్నతస్థాయి ప్రతినిధులతో సమావేశమయింది. ముందుగా టకుమా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలంగాణలో దాదాపు సగం పట్టణ ప్రాంతమని, పెరుగుతున్న నగరీకరణ, పట్టణీకరణ నేపథ్యంలో తమ ప్రభుత్వం వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నదని, ముఖ్యంగా హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వేస్ట్ మేనేజ్‌మెంట్ పరిష్కారాల కోసం చూస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో టకుమా కంపెనీతో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రముఖ ఇంజినీరింగ్ కంపెనీ మినెబియా ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. మినెబియా కంపెనీ విస్తరణలో తెలంగాణ రాష్ర్టాన్ని పరిశీలించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఈఎస్‌ఈ ఫుడ్స్ చైర్మన్ హికోనోబు ఇసేతో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న అవకాశాలను వివరించారు. మేయిజి షియికా ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ వ్యవసాయం, వెటర్నరీ మందుల తయారీకి తెలంగాణకు రావాలని కోరారు. సుమిటోమో ఫారెస్ట్రీ కంపెనీ, టోరే ఇండస్ట్రీస్ వంటి పలు కంపెనీల ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు.

ఇన్నొవేషన్ నెట్‌వర్క్ కంపెనీ
జపాన్ ఇన్నొవేషన్ నెట్‌వర్క్ బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. జపాన్ కంపెనీలను, ప్రపంచ ఇన్నొవేషన్ కమ్యూనిటీలను ఈ జపాన్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్స్ కలుపుతుంది. కంపెనీలకు, ఇన్నొవేషన్‌కు మధ్య ఇది వారధిగా పనిచేస్తుంది. సమావేశం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ టీహబ్, టీ ఫైబర్ వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ రెండు కార్యక్రమాల పట్ల నెట్‌వర్క్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జపాన్ పర్యటనలో మంత్రి కేటీఆర్ వెంట తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జీ వివేక్‌తోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, అధికారులున్నారు.