ప్రేమ విఫలమై… సమస్యలతో సతమతమై..

షాపూర్‌నగర్‌: ప్రేమించిన వ్యక్తి దూరం పెట్టడం.. ఆస్తి తగాదా తోడు కావడం.. ధైర్యం చెప్పే కుటుంబ పెద్ద అండ లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎంటెక్‌ విద్యార్థిని లేఖ రాసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దయాదాక్షిణ్యాలు లేని మనుషుల మధ్య ఉండలేనని, నమ్మిన ప్రియుడు మోసం చేశాడని… తల్లిని సంతోష పెట్టాలనే కోరిక తీరనందుకు బాధపడుతున్నానని… తల్లిని బాగా చూసుకోవాలని రాసింది. జీడిమెట్ల సీఐ శంకర్‌రెడ్డి, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. చెరుకుపల్లి కాలనీకి చెందిన జయలక్ష్మి, ప్రభాకర్‌ దంపతులకు ఒక కుమారుడు విన్ని, ముగ్గురు కుమార్తెలు వంశీ, చైతన్య(24), హర్ష. ప్రభాకర్‌ 20 ఏళ్ల క్రితమే చనిపోవడంతో జయలక్ష్మి ఉద్యోగం చేస్తూ నలుగురు పిల్లలను చదివించింది. నాలుగేళ్ల క్రితం వంశీకి వివాహం జరిపించింది. హర్ష, విన్ని ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండగా చైతన్య వెల్లూర్‌లోని విట్‌లో ఎంటెక్‌  చదువుతోంది. రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి గాగిల్లాపూర్‌లోని స్నైడర్‌ పరిశ్రమలో ప్రాజెక్టు వర్క్‌ చేస్తోంది. రెండేళ్లుగా వెల్లూర్‌ సమీపంలోని అంబూర్‌కు చెందిన కిశోర్‌, చైతన్య ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఇటీవల దూరం పెరిగిపోవడంతో చైతన్య మానసికంగా కుంగిపోయింది. కుటుంబసభ్యుల వద్ద  వాపోయింది. దీనికితోడు చెరుకుపల్లి కాలనీలోని తమ ఇంటి స్థలంలో సగ భాగాన్ని స్థానిక సంక్షేమ సంఘం నేత కబ్జా చేసిన వ్యవహారం కోర్టులో నడుస్తోంది. దీన్ని చైతన్యే చూస్తోంది. కుటుంబంలో ముగ్గురు పనిచేస్తున్నా అవసరాలు తీరడం లేదనీ మనోవేదనకు గురవుతోంది. శనివారం రాత్రి కుటుంబసభ్యులంతా రెండో ఆట సినిమాకి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి వచ్చి చూసేసరికి చైతన్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించింది. ఆసుపత్రికి తరలించగా చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. కిశోర్‌పై కేసు నమోదు చేశారు.