ప్రేమజంటలను బెదిరించి దోపిడీ చేసిన నకిలీ పోలీస్

నకిలీ పోలీసు కోర్టుకు తరలింపు
రూ.8 వేల నగదు, తులంన్నర బంగారం స్వాధీనం
నగరంలో నాలుగు చోట్ల దోపిడీలు
వరంగల్‌ అర్బన్‌ క్రైం: హన్మకొండ హనుమాన్‌నగర్‌లో శుక్రవారం రాత్రి ప్రేమికులపై దాడి చేస్తూ స్థానికులకు పట్టుబడిన వేల్పుల కుమారస్వామిని పోలీసులు అరెస్టుచేసి కోర్టుకు తరలించారు. హన్మకొండ క్రైం ఎస్‌ఐ నూనావత్‌ వెంకట్రాం తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మం డలం మొండ్రాయి గ్రామానికి చెందిన కుమారస్వామి గతంలో వ్యవసాయం చేసేవాడు. వచ్చే డబ్బులు తాగుడుకు, విలాసాలకు సరిపోకపోవడంతో దారిదోపిడీలకు పాల్పడేవాడు.

నగరంతో పాటు నగర శివారులో ఒంటరిగా సంచరించే ప్రేమికులను టార్గెట్‌ చేసి పోలీసునంటూ బెదిరిస్తూ, దాడి చేస్తూ దోపిడీకి పాల్పడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హనుమాన్‌నగర్‌లో ఇద్దరు ప్రేమికులను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్‌ చేస్తుండడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారించడంతో చేసిన తప్పులను ఒప్పుకున్నాడు. సుబేదారి పోలీసు స్టేషన్‌ పరిధిలో 2, కేయూ పరిధిలో 1, హన్మకొండ పీఎస్‌ పరిధిలో 1 చొప్పున నాలుగు చోట్ల ప్రేమికుల ను అటకాయించి దోపిడీ చేసినట్టు చెప్పాడు.

ఈ కేసుల్లో నిందితుని నుంచి 15 గ్రాముల (తులంన్నర) బంగారు గొలుసు, ఉంగరం, రూ.8 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. కుమారస్వామిని శనివారం కోర్టుకు తరలించామని చెప్పారు. ఈ కేసుకు సహకరించిన వారిలో క్రైం పోలీసులు రాం రెడ్డి, రమేష్‌, నాయక్‌ ఉన్నారు.

Leave a Reply