గవర్నర్ స్పీచ్ అక్షర సత్యం : సీఎం కేసీఆర్

శాసనసభలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం అక్షర సత్యం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గవర్నర్ స్పీచ్ విషయంలో ప్రతిపక్ష సభ్యులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. సభ్యులందరూ తెలుసుకోవాల్సిన విషయమేమంటే.. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా ఉండే వ్యక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిందే చదవాలి. గవర్నర్ స్పీచ్‌కు కేబినెట్ ఆమోదం తెలపాలి. ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదవుతారు. ప్రభుత్వంలో జరిగే సత్యాలనే గవర్నర్ చదవి వినిపించారు. ప్రభుత్వం సాధించుకున్న లక్ష్యాలను.. నిర్దేశించుకున్న లక్ష్యాలను గవర్నర్ సభలో చదవి వినిపించారు. ఈ మధ్య కొందరు పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సంఘటలను బాధను కలిగిస్తున్నాయని తెలిపారు. సభ్యులు అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని సీఎం అన్నారు.

రాష్ట్ర అప్పులపై సీఎం కేసీఆర్ వివరణ

రాష్ట్ర అప్పులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో స్పష్టంగా వివరణ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులపై మాట్లాడారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. రాష్ట్ర అప్పులపై కిషన్‌రెడ్డి చెప్పిన లెక్కలు సత్యదూరాలు అని స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. కిషన్‌రెడ్డి చెప్పిన లెక్కలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం.

రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఎంత అప్పు ఉందో ఆ లెక్కలు ఆర్బీఐ దగ్గర ఉంటాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచి ఇచ్చిన అప్పు రూ. 72 వేల కోట్లు అని తెలిపారు. ఈ రోజు నాటికి పాతవి, కొత్తవి మొత్తం కలిసి అప్పు రూ. 1,42,000 కోట్లు. అలాంటప్పుడు రూ. 2 లక్షల కోట్ల అప్పులు ఎలా చేస్తామని ప్రశ్నించారు. ఈ ఫిగర్స్ కాగ్, ఆర్బీఐతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వద్ద కూడా ఉంటాయి. 23 జిల్లాల ఏపీ ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు క్యాపిటల్ ఖర్చు రూ. 1,29, 683 కోట్లు. జానాభా ప్రకారం తెలంగాణకు రూ. 54 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ అంత ఖర్చు పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో తెలంగాణ క్యాపిటల్ ఖర్చు రూ. 1.25 కోట్లు. ప్రభుత్వం పారదర్శకంగా పాలన చేస్తుంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. కిషన్‌రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నా. ఒక మిత్రుడిగా చెబుతున్నా. మీకు మంచి భవిష్యత్ ఉంది. ఇష్టమొచ్చినట్లు అప్పులు చేయడానికి ప్రభుత్వాలకు లేదని కిషన్‌రెడ్డికి సీఎం సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు వచ్చే ఆదాయం రూ. 10 వేల 500 కోట్లు. రైతుల రుణమాఫీ కోసం కేంద్రం, ఆర్బీఐ చుట్టూ అనేకసార్లు తిరిగాం. వాళ్లు ఇవ్వకపోవడంతోనే నాలుగు విడతలుగా రుణమాఫీ చేశామన్నారు. తాము రైతులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఆ మేరకు రుణమాఫీ చేశామని సీఎం తెలిపారు. రూ. 2 లక్షల రుణం ఒక్కసారి మాఫీ చేస్తే.. పాలన స్తంభించి పోతుంది. ఇది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని సీఎం స్పష్టం చేశారు.