శ్రీదేవి ఆఖరి ఫోటో

ముంబయి: వెండితెర అతిలోక సుందరి పార్థివ దేహం విల్లే పార్లే సమాజ్‌ సేవా హిందూ శ్మశాన వాటికకు చేరుకుంది. సుమారు 7 కిమీ మేర అంతిమ యాత్ర సాగింది. శ్రీదేవి పార్థివదేహాన్ని ఆమెకు ఇష్టమైన ఎరుపు రంగు కాంజీవరం చీర, ఎర్రని బొట్టు, పూలతో అలంకరించారు. అంతిమయాత్రలో బోనీ కపూర్‌ కుటుంబీకులందరూ పాల్గొన్నారు. వారితో పాటు తమ అభిమాన నటికి కడసారి వీడ్కోలు పలికేందుకు బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళం సినీ పరిశ్రమలకు చెందిన పలువురు  ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గౌరవ సూచకంగా ఆమె పార్థివ దేహానికి త్రివర్ణ పతాకం కప్పారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.పార్థివ దేహాన్ని చూసేందుకు ఇప్పటికే శ్మశాన వాటికకు వేల సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. వారందరి బాధాతప్త హృదయాల నడుమ మరికాసేపట్లో తుది వీడ్కోలు పలకనున్నారు.