శశికళకు 5న పెరోల్‌ మంజూరు..?

బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు ఈనెల 5న పెరోల్ మంజూరు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తన భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందున 15 రోజులు పెరోల్ మంజూరు చేయాలని పరప్పన అగ్రహార జైలు అధికారులకు శశికళ దరఖాస్తు చేసుకున్నారు. ఆమె విజ్ఞప్తిని బుధవారంనాడు పరిశీలించి గురువారం నుంచి పెరోల్ మంజూరు చేసే అవకాశాలున్నట్టు శశికళ సన్నిహిత వర్గాల సమాచారం. అయితే ఎన్ని రోజులు పెరోల్ మంజూరు చేస్తారనేది అధికారుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. శశికళ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఆమె మేనల్లుడు, అన్నాడీఎంకే తిరుగుబాటు నేత టీటీవీ దినకరన్ సైతం సోమవారంనాడు ధ్రువీకరించారు.
కాగా, గత తొమ్మిది నెలలుగా చెన్నైలోని జీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు సోమవారం రాత్రి మెడికల్ బులిటెన్ విడుదల చేశాయి. కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ కావడంతో లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లివర్, కిడ్నీ ట్రాన్‌ప్లాంటేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో శశికళకు పెరోల్ మంజూరు చేసే అవకాశాలు బలంగానే ఉన్నాయని చెబుతున్నారు.

Leave a Reply