పెట్రోల్‌, డీజిల్‌పై సుంకం తగ్గింపు

న్యూదిల్లీ: వాహనదారులకు కేంద్రం తీపి కబురు అందించింది. రోజువారీ ధరల సమీక్ష విధానం తర్వాత భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి వినియోగదారులకు వూరట కల్పించింది. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 మేర ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. తగ్గించిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆదాయానికి ఏడాదికి రూ.26వేల కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.13వేల కోట్ల మేర గండిపడనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయినా, సామాన్యుడి సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
అంతర్జాతీయంగా ముడిచమురు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.70.88 కాగా.. డీజిల్‌ ధర రూ.59.14గా ఉంది. ప్రస్తుతం పెట్రోల్‌పై రూ.21.48లు, డీజిల్‌పై రూ.17.33లు ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్రానికి ఆదాయం వస్తోంది. ఇటీవల ధరలు పెరుగుతున్నా ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించకపోవడంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జులై 4 తర్వాత పెట్రోల్‌ ధర రూ.7.8 పెరగ్గా.. డీజిల్‌ ధర రూ.5.7 మేర పెరగడం గమనార్హం.

Leave a Reply