పార్లమెంటు బయటా.. లోపలా ఆందోళనలు

దిల్లీ: కేంద్రం బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై సోమవారం పార్లమెంటు బయటా.. లోపలా ఆందోళనలు కొనసాగాయి. విభజన చట్టం ప్రకారం తమ రాష్ట్రానికి దక్కాల్సిన హామీలు, ప్రయోజనాలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ  తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి ‘మాకు న్యాయం చేయండి.. ప్రధాని దీనిపై స్పందించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో తోట నరసింహం, టీజీ వెంకటేశ్‌, శివప్రసాద్‌, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల కిష్టప్ప, గల్లా జయదేవ్‌ సహా తెదేపా ఎంపీలందరూ పాల్గొన్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో అరకొర నిధులతో అభివృద్ధి సాధ్యపడదని.. అందుచేత కేంద్రం విరివిగా నిధులిచ్చి ఆదుకోవాలని ఎంపీలు కోరారు. విభజన హామీలు నెరవేర్చకపోతారా అని చూస్తుంటే.. నాలుగేళ్లుగా నిరాశే ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంటులో పోరాడండి: ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పార్లమెంటు బయటా లోపలా తెలిసేలా నిరసన చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. దిల్లీలో ఉన్న ఎంపీలతో ఆయన అమరావతి నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించుకునే విషయంలో రాజీలేదు.  ఇస్తామన్నవి ఇవ్వడం లేదు, బడ్జెట్‌లోనూ పొందుపరచడం లేదు. నిధుల కేటాయింపు పూర్తిగా ఉండట్లేదు. ఇవన్నీ పార్లమెంటు, కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి’ అని ఎంపీలకు సూచించారు. అన్ని హామీలు నెరవేర్చేవరకు పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలిసేలా చేయాలని సూచించారు.  

రాజ్యసభలో కాంగ్రెస్‌..

విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సభ్యులు రాజ్యసభలో ఆందోళన చేపట్టారు. కేవీపీ రామచంద్రరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలకు అడ్డుతగలొద్దని, సభ నిర్వహణకు సహకరించాలని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు కాంగ్రెస్‌ సభ్యులను కోరినా ఫలితం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయడంతో కేంద్రం విఫలమైందని సభ్యులు ఆరోపించారు. గందరగోళం నెలకొనడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు.