కాంగ్రెసుకు కలిసిరాని చిరంజీవి-Eenadu.us
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రచారం కాంగ్రెసు పార్టీకి ఏ మాత్రం కలిసి వచ్చినట్లు లేదు. ఆయన ప్రచారం వల్ల కాంగ్రెసు పార్టీకి ఒరిగిందేమీ లేదని కడప లోకసభ స్థానానికి, పులివెందుల శాసనసభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే కాకుండా తమిళనాడు శాసనసభా ఎన్నికల ఫలితాలు కూడా తెలియజేస్తున్నాయి. కడప లోకసభ స్థానంలో చిరంజీవి పెద్ద యెత్తున ప్రచారం చేశారు. పులివెందులలో కూడా ఆయన ప్రచారంలో పాల్గొని హంగామా సృష్టించారు. ఆయన ప్రచారం పులివెందులలో వైయస్ విజయమ్మ మెజారిటీని గానీ కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్ మెజారిటీని గానీ ఏ మాత్రం తగ్గించలేకపోయారు. కడప లోకసభ స్థానంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. వైయస్ జగన్‌పై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలను ఓటర్లు ఏ మాత్రం పట్టించుకోలేదని అర్థమవుతోంది. వైయస్ జగన్‌కు, వైయస్ విజయమ్మకు భారీ మెజారిటీ రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ అవినీతిపై చేసిన ఆరోపణలు కూడా వృధా అయ్యాయి.
తమిళనాడులో కూడా చిరంజీవి ప్రచారం చేశారు. ఆయన మూడు రోజుల పాటు ప్రచారం సాగించారు. తమిళనాడులో కూడా ఆయన ప్రచారం కాంగ్రెసుకు కలిసి రాలేదని అర్థమవుతోంది. తమిళనాడులో కాంగ్రెసు 65 స్థానాలకు పోటీ చేయగా నాలుగు స్థానాలు మాత్రమే దక్కాయి. దీన్ని బట్టి చిరంజీవి ప్రచారం కాంగ్రెసుకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చి పెట్టలేదని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెసు ఎక్కువ సీట్లు తీసుకుని ఆ సీట్లను కోల్పోవడం ద్వారా డిఎంకెను కూడా దెబ్బ తీసిందని చెప్పవచ్చు.
Short URL: http://www.eenadu.us/?p=1076








